Sunday, August 9, 2015

ఊరికి శ్రీమంతులు

ప్రతి పల్లె.. ఓ దత్త పుత్రిక
ఊరు నుంచి చాలా తీసుకున్నాను. తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతా!నన్నుకూడా నాకు తోచింది చేయనివ్వండి. లెట్ మీ ఎర్న్ సమ్ రెస్పెక్ట్!! ఊరు.. దత్తత ప్రాధాన్యం చెప్పిన శ్రీమంతుడి డైలాగ్స్ ఇవి! పిల్లల్ని దత్తత తీసుకోవడం పాతమాట. ఊర్లను దత్తత తీసుకోవడం ఇప్పటిమాట! గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనే బాధ్యతగా మార్చుకుంటున్న సరికొత్త ట్రెండ్! పీఎం.. సీఎం.. అందరూ దత్తతతో గ్రామజ్యోతిని వెలిగించేందుకు వస్తున్న ఊరికి శ్రీమంతులు!!



ఫారిన్ నుంచి ఓ ధనిక యువకుడు పచ్చని పల్లెటూరుకి వస్తాడు. పండగలకు.. పబ్బాలకు మాత్రమే సొంతూరుకి రావడం కాదు. వెలకట్టలేని ఆస్తిని ఇచ్చిన ఆ ఊరికి ఏదో ఒక మేలు చేయాలని గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. శ్రీమంతుడులోని ఈ థీమ్.. సామాజిక స్పృహను కల్పిస్తోంది! దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు! అనే మాటని మరోసారి గుర్తుకుతెచ్చేట్లు చేస్తోంది. దాన్ని నిజం చేయాల్సిన ఆవశ్యకత ఉందని మనసుల్ని తడుతూ.. తనలాంటి శ్రీమంతుల్ని ఊరుబాట పట్టిస్తోంది! దేశ పునర్నిర్మాణం జరిగి గ్రామస్వరాజ్యం రావాలంటే ఇవన్నీ అవసరమే కదా మరి!

దత్త పుత్రిక..
గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే లక్ష్యంతో భారతప్రధాని నరేంద్రమోడీ! సంసద్ ఆదర్శ్ యోజన పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి పరచేందుకు శ్రీకారం చుట్టారు. ఇదేబాటలో తెలంగాణ సర్కార్ కూడా నడుస్తోంది. ఆదర్శ్ యోజన తరహాలోనే సరికొత్త గ్రామజ్యోతి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యతను ప్రజాప్రతినిధులకు.. అధికారులకు అప్పగించింది! ఇప్పడు శ్రీమంతుడు కూడా ఈ థీమ్‌తో వచ్చినదే.


వీటి ప్రభావంతో సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకునే పనిలో బిజీగా ఉన్నారు. సొంత ఊరుకు కొంతైనా చేస్తే సార్ధకత ఉంటుందనే ఆలోచన వీరిది. దీనికి తోడు శ్రీమంతుడు గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే సోషల్ కాజ్‌తో రావడం దీన్ని స్ఫూర్తిగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రామాలను దత్తత తీసుకోవడం మన రాష్ట్రంలో తీసుకుంటే దివంగత హీరో శ్రీహరి చాలా ఏళ్లక్రితమే ఈ పనిచేశారు. ఇప్పటికీ ఆయన భార్య శాంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుననారు. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయితే ఏకంగా మహారాష్ట్రను కాదనుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నెల్లూరుజిల్లాలోని పుట్టమరాజు కండ్రిక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధిపథంలో నడిపిస్తూ ఆ గ్రామాన్ని దత్త పుత్రికగా భావిస్తున్నారు.


గ్రామ వికాసం..
మారిన పరిస్థితులు.. గ్లోబలైజేషన్‌తో గ్రామాలు ఉనికిని కోల్పేయ ప్రమాదం ఏర్పడింది. విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్ల వంటి అత్యవసర, మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. మెరుగైన వైద్యం పల్లెల్లో కరువైంది. పల్లెటూళ్లలో ఈ పరిస్థితుల కారణంగా ప్రజల ఉపాధి అవకాశాల దెబ్బతిని.. పట్టణాలకు వలసపోతున్నారు.

మరి ఇలా అయితే భారత పట్టుగొమ్మలు బాగుపడేదెప్పుడు? ఊరును బాగుచేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. పెద్దలు ఏం చేస్తే పిల్లలు కూడా అదేబాటలో నడుస్తరు. అందుకే పెద్దలు ఊరుని బాగుచేసుకునే పనులు చేపట్టాలి అని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటీవలే ఆయన దత్తత తీసుకున్న చిన్న ముల్కనూర్ గ్రామంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ తనలా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని సూచించారు. పర్యారణ అభివృద్ధి, మానవహక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధి, స్వపరిపాలన, వ్యక్తిగత ప్రగతి, సంపూర్ణ అక్షరాస్యత, మహిళాసాధికారత వంటి సౌకర్యాలు కల్పించేందుకు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇవన్నీ ఉంటే గ్రామం వికసించడం ఖాయం!


ప్రజలకు అధికారం..
గ్రామాలను దత్తత తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అనే సందేహాలు చాలామందికి ఉండే ఉంటాయి. ఊరిని దత్తత తీసుకోవడమంటే నిన్ను.. వాణ్ణి.. వీణ్ణి.. అందర్నీ దత్తత తీసుకోవడమేననే మహేశ్ డైలాగ్ గుర్తుచేసుకుంటే దీనికి సమాధానం లభిస్తుంది. గ్రామాన్ని దత్తత తీసుకోవడమంటే ఊర్లో బోర్లు వేసి.. నీరు పారించి.. చదువు చెప్పించడమే కాదు. ఊరు అభివృద్ధికి అఘాతం కలిగిస్తున్న వ్యక్తుల్ని కూడా నియంత్రించడమే అని చెప్పవచ్చు.

ప్రజలకే ఊరిపై సర్వాధికారాలు ఉండేట్లు చేయడం అన్నమాట. జీవితాన్ని ప్రసాదించిన సొంత ఊరు రుణం తీర్చుకునేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఎన్నారైలు సైతం దిగివస్తున్నారు. నరేంద్రమోడీ మొదటి లక్ష్యం కూడా ఎన్నారైలే. చిత్తూరుజిల్లాకు చెందిన ఎన్నారై అబ్దుల్ అలీ అయితే ఏకంగా 16 గ్రామాలను దత్తత తీసుకుని రికార్డ్ సృష్టించాడు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు కూడా గ్రామాలను దత్తత తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన.. అభివృద్ధి కల్పించి ప్రజల చేతుల్లో అధికారం కట్టబెట్టేందుకు ఇలాంటివాళ్లంతా కృషి చేస్తున్నారు.


కదిలిస్తోంది..
నరేంద్రమోడీ మంత్రం ఫలిస్తోంది. ఆయన పిలుపు సెలబ్రిటీలను కదిలిస్తోంది. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎన్నారైలు.. ఇతర సెలబ్రిటీలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు! ప్రధాని నరేంద్రమోడీ సంసద్ ఆదర్శ్‌లో భాగంగా వారణాసిలోని జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కూడా ఈ కార్యక్రమంతో చేతులు కలిపారు. ఆమె నియోజకవర్గం రాయభలేరిలోని జగత్‌పూర్ గ్రామ పూర్తి అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకున్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నియోజకవర్గం అమేథిలోని జగ్దీష్‌పూర్‌లో దీహ్ గ్రామాన్ని దత్త తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోజిల్లా బేటీ గ్రామాన్ని దత్తత తీసుకోగా.. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఏకంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. గుజరాత్‌లోని వడోదర జిల్లాలో కర్ణాలి, పిపాలియా, వలీదా, బాగ్లీపురా గ్రామాలను దత్తత తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రవాల్ విలేజ్‌ని హేమామాలిని దత్తత తీసుకున్నారు. వీళ్లతో పాటు అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, సుష్మ స్వరాజ్, ఏకె ఆంటోని, శరద్‌పవార్, శరద్ యాదవ్, డింపుల్ యాదవ్ వంటి సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకుని ఊర్లను బాగుచేసే పనిలో నిమగ్నమయ్యారు.


మారనున్న దశ..
పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామస్థాయిలో తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఆగస్టు 17 నుంచి 24 వరకు గ్రామ జ్యోతీ వారోత్సవం నిర్వహించనుంది. దీనిలో భాగంగా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రతి ముఖ్య అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయా గ్రామాల్లో మార్పు కోసం పాటుపడతారు. మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారు. మండలానికో అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరించి గ్రామాల్లో కార్యక్రమాలు సమన్వయం చేస్తూ పర్యవేక్షిస్తారు. ఇలా నిరంతపర పర్యవేక్షణ.. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల దశ-దిశ మారే అవకాశాలున్నాయి.

తెలుగునాట..
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన నియోజకవర్గంలోని కందకుర్తి, మాణిక్ బండార్, జగిత్యాల గ్రామాలను దత్తత తీసుకున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమగోదావరి జిల్లా మొగుల్తూరులోని తీరప్రాంతాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను తీసుకున్నారు. మహేశ్‌బాబు గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లా అరకు పంచాయతీని దత్తత తీసుకున్నారు.

---దాయి శ్రీశైలం

No comments:

Post a Comment