Monday, August 17, 2015

Grama Jyothi Updates

మేలుకుంటేనే మేలు.. స్వయంపాలనతోనే గ్రామీణాభివృద్ధి
-సంఘటితంగా కదులుదాం
- ప్రజలంతా చేతులు కలిపితే వేల కోట్ల సంపద
- గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్..
ఈ మూడు గ్రామాలే అందుకు నిదర్శనం
- ప్రతీపశక్తులను పట్టించుకోవద్దు
- వ్యక్తులుగా బాగుంటున్నా.. సంఘంగా విఫలమవుతున్నాం
- గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ
- గుడుంబా రాక్షసిని తరిమికొట్టాలి: సీఎం
- గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

ప్రజలంతా చేతులు కలిపితే ఆ చేతులు వేల కోట్ల సంపదను సృష్టిస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రజలకు తమ సంఘటిత శక్తిలోని విలువ ఎంతో తెలియదని, గతంలో ఎవరూ చెప్పే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇకనైనా మేలుకొని ఎవరి గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకోవాలే తప్ప బయటివారు వచ్చి బాగుచేయరని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని సీఎం చెప్పారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అభివృద్ధిని దెబ్బతీసే ప్రతీపశక్తులు అంతటా ఉంటాయని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని ఉద్బోధించారు. వెలుతురు వెంటే చీకటి ఉంటుంది.
చీకటిని చూసి బెదిరిపోవద్దు, భయపడొద్దు. వ్యతిరేకించేవాళ్లు మనమధ్యే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. వ్యక్తులుగా మనం బాగుంటున్నాం కానీ.. కానీ సంఘంగా విఫలమవుతున్నామని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైందన్న సీఎం.. ఆ బలంతోనే గంగదేవిపల్లి ఇరవై మూడేండ్లుగా మంచి అభివృద్ధి సాధించిందని చెప్పారు. రాష్ట్రంలోని పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేవేసే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం గ్రామజ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం స్వయంపాలనతో స్వయం సమృద్ధి సాధించాలన్నదే గ్రామజ్యోతి లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో గ్రామానికి ఏం కావాలో ప్రజలే గ్రామసభల్లో నిర్ణయించుకొని అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గ్రామజ్యోతి ఆశయాలు, ప్రణాళికలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. గంగదేవిపల్లె ప్రజలు ఎవరి మీద ఆధారపడకుండా తమ గ్రామాన్ని తామే కమిటీలు వేసుకుని బాగు చేసుకున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ప్రతి గ్రామం గంగదేవిపల్లిను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అభివృద్ధిలో ముందున్న గంగదేవిపల్లి స్వయంసమృద్ధినికూడా సాధించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయపద్ధతుల్లో కూడా మార్పులు చేసుకుని నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లాగా సంపన్నగ్రామం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..


మీ స్ఫూర్తి గొప్పది..
గంగదేవిపల్లికి శిరస్సు వంచి మొక్కుతున్న. మీ స్ఫూర్తి గొప్పది. దేశ విదేశాల నుంచి చాలా మంది ఈ గ్రామానికి వచ్చి వెళ్లారు. నేను కూడా ఇక్కడికి వచ్చాను. రాష్ట్రంలో చాలా ఊళ్లు ఉన్నా వచ్చాను.. అంటే ఇక్కడ గంగమ్మతల్లులు రప్పించారు. వ్యక్తులుగా మనం బాగుంటున్నాం. కానీ సంఘంగా ఫెయిల్ అవుతున్నాం. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైంది. ఆ బలంతో మీరు ఇరవై ఇరవైమూడేండ్లు మంచి అభివృద్ధి సాధించారు. మీకు మీరుగా గ్రామాన్ని గొప్పగా మలచుకున్నారు. ఇవ్వాళ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. గంగదేవిపల్లిను చూస్తే కొత్త ఆశలు కలుగుతున్నయి. మీరు ఇక ఏదైనా సాధించగలరనే నమ్మకం ఏర్పడింది. అయితే ఇంతటితో ఆగకుండా స్వయం సమృద్ధి దిశగా ఎదగాలి


మూడు గ్రామాలు ఆదర్శం..
రాష్ట్రంలో మూడు గ్రామాలు ఎవరి మీదా ఆధారపడకుండా, ప్రభుత్వాలవైపు వేచి చేసి ఉండకుండా తమకు తోచిన విధంగా కట్టుబాట్లతో, పద్ధతులతో ఆదర్శవంతంగా ఎదిగాయి. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్, కరీంనగర్ జిల్లాలో ముల్కనూర్, వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి. ఈ మూడు గ్రామాలు ఆదర్శంగా, ప్రపంచం మెచ్చేలా నిలిచాయి. తెలంగాణలోని అన్ని గ్రామాలు ఈ మూడు గ్రామాలను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి.

ఏ గ్రామానికాగ్రామం బాగుపడితే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. మనలో ఎంతో శక్తి ఉంది. భూమి మీదకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి వెళ్లాలి. మన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం బాగుపడాలి. ఎన్నికలు, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. బాగుపడడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. చాలా సమస్యలు వస్తాయి. వెలుతురు వెంటే చీకటి ఉంటుంది. చీకటిని చూసి బెదిరిపోవద్దు, భయపడొద్దు. వ్యతిరేకించేవాళ్లు మనమధ్యే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు


ఆర్థిక స్వాతంత్య్రం దిశగా అడుగేయండి
గంగదేవిపల్లి పట్టుదలతో సాధించిన ప్రగతి బాగా ఉంది. అయితే ఇంతటితో ఆగకుండా స్వయం సమృద్ధి దిశగా ఎదగాలి. స్వయం సమృద్ధి అంటే ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశగా ఆలోచించాలి. గ్రామంలో అందరికీ భూమి ఉండదు. కాబట్టి భూమిలేని వాళ్లు, వృత్తిపనులు చేసుకునేవారికి ఇక్కడే ఉపాధి మార్గాలు సృష్టించి స్వయం ఉపాధి కల్పించుకోవాలి. వారికి ఆర్థిక చేయూతనివ్వాలి. వారితో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు గ్రామంలోనే అమ్మించి ఉపాధి కల్పించాలి. అట్లనే ఒక చెప్పుల దుకాణం పెట్టించాలి. ఆ దుకాణంలోనే ఊరోళ్లందరూ కొనుక్కునేలా చూడాలి. అదేవిధంగా కుట్టుమిషన్లు కొనిచ్చి ఉపాధి కల్పించాలి. ఇలా ఆయా వృత్తిపనుల వాళ్లకు ఉపాధి కల్పించే పని చేయవచ్చు. అలాగే మీ దగ్గర పంటల విధానం కూడా మార్చుకోవచ్చు.

ఇందుకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం స్ఫూర్తిగా ఉంది. ప్రభుత్వం తరపున రెండు బస్సులు పెట్టి మిమ్మల్ని పంపిస్తా. వెళ్లి అక్కడ వ్యవసాయం పద్ధతులు చూసిరండి. అంకాపూర్‌లో కూడా మీలాగా బోర్లతోనే వ్యవసాయం చేస్తరు. అక్కడ గతంలో సర్వవర్గ సమితి ఉండే. కానీ దాని పేరు మార్చుకున్నారు. ఇప్పుడది విలేజ్ డెవల్‌మెంట్ కమిటీగా మారింది. ఆ గ్రామంలో పండే పంటలకు వారే మార్కెట్ చేసుకుంటారు. చేలనుంచి పంట వచ్చేసరికి ఆ గ్రామంవద్ద డజన్ల కొద్దీ డీసీఎంలు సిద్ధంగా ఉంటయి. అక్కడినుంచి అటే మార్కెట్‌కు తీసుకుపోతరు. అలాంటి పరిస్థితి మీ దగ్గర రావాలి. అలాగే గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి తేవాలి. ఇక్కడున్న 600 ఎకరాల వ్యవసాయ భూమి అంతా డ్రిప్ ఇరిగేషన్‌తో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. మంచి పంటలు బాగా పండించాలి. గంగదేవిపల్లి గ్రామానికి డ్రిప్ ఇరిగేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేస్తుంది.


వెయ్యేండ్లు బతుకుతమా..?
మనం మనుషులుగా వెయ్యేండ్లు బతుకుతమా? ఉన్నన్ని రోజులు మనం మంచిపనులు చేసేందుకు మనవంతుగా తోడ్పాటును అందించుకోవాలి. మనం ఉన్నప్పుడు ఏం చేశామనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ పోరాటం చేశారు. ఇవ్వాళ గాంధీ లేరు. కానీ ఆయన అందించిన స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు పటిష్టంగా పట్టుదలతో అమలు చేసుకోవాలి. మనుషులుగా మీరు చూపించిన సంఘటిత శక్తి యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలవాలి. గంగదేవిపల్లి ఇదే స్ఫూర్తిని, ఐక్యతను సాధించి బంగారు పల్లి కావాలి. బంగారు తెలంగాణకు స్ఫూర్తివంతంగా నిలబడాలి.


గుడుంబా రాక్షసి పోవాలె..:
గంగదేవిపల్లి సభ అనంతరం నల్లబెల్లి మండలం మేడపల్లి-రాంపూర్ జంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామజ్యోతి సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పల్లెల్లోనుంచి గుడుంబా మహమ్మారిని తరిమివేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా పల్లెల్లో గుడుంబా రాక్షసి పట్టి పీడిస్తున్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి గ్రామంలో 20-30మంది వితంతువులు.. అదీ యువ వితంతువులు ఉంటున్నారు. చిన్న వయస్సులో వితంతువులుగా మార్చుతూ కుటుంబాలను వీధిపాలు చేస్తున్న ఈ గుడుంబా రాక్షసిని తరిమికొట్టాలి అని సీఎం పిలుపునిచ్చారు.

Sunday, August 16, 2015

గ్రామజ్యోతి వెలిగిద్దాం

- నేడే గ్రామజ్యోతికి శ్రీకారం .. ముహూర్తం: ఉదయం11 గంటలకు
- పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
- సింగారించుకున్న గంగదేవిపల్ల్లి
- గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: సీఎం సందేశం
- దత్తత గ్రామాల్లో కార్యక్రమాల్లో పాల్గొననున్న
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌కు మంత్రి కేటీఆర్
- భూరి విరాళాలతో ముందుకు వస్తున్న దాతలు

పల్లెల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకం సోమవారం నుంచే ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉదయం 11 గంటలకు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే సమయానికి అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలను పార్లమెంటు, అసెంబ్లీలో కాకుండా ఊరి నడిబొడ్డున ప్రజల సమక్షంలో గ్రామ సభల ఆమోదంతో రూపొందించడమే ఈ పథకం విశిష్టత. ప్రజల సంఘటిత శక్తిని వారికి తెలియపరిచి గ్రామాభివృద్ధిలో వారిని సంపూర్ణ భాగస్వాములను చేయడం పథకం ఉద్దేశం.

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ గ్రామాల్లో సాధించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ మహత్తర ఆశయంలో భుజం భుజం కలిపి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బృహత్ కార్యక్రమానికి చేయూతనివ్వడానికి ఇప్పటికే పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. యశోదా వైద్యసంస్థల సంస్థాపకులు, ఫార్మా కంపెనీ అధినేతలు భూరి విరాళాలు అందించనున్నారు. వేలాది గ్రామాల్లో ప్రజలు తమ గ్రామాన్ని బాగు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

నిధులన్నీ ఒకే గొడుగు కిందికి..
గ్రామపంచాయతీలకు వివిధ శాఖల నుంచి వచ్చే నిధులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభలను నిర్వహించి, రాబోయే నాలుగేండ్లకు గ్రామ అవసరాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం ఈ పథకంలో ముఖ్యాంశం.

Friday, August 14, 2015

పల్లె సీమల ప్రగతి చిత్రం


-గ్రామజ్యోతి మార్గదర్శకాలు ఖరారు
-ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
-ఏడు అంశాలపై గ్రామాల్లో ప్రత్యేక కమిటీలు
-వాటి పర్యవేక్షణలోనే అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన
-నేడు అధికారిక ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
-17న గంగదేవిపల్లిలో లాంఛనంగా కార్యక్రమ ప్రారంభం


తెలంగాణ పల్లె సీమల చిత్రాన్ని సమూలంగా మార్చివేసేందుకు, ప్రగతిబాటన ఉరకలెత్తించేందుకు, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడంద్వారా గ్రామపంచాయతీలు స్వయం సమృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమం విధివిధానాలు వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. గ్రామం మొదలుకొని జిల్లాస్థాయివరకు ఎవరెవరు ఏయే విధులు నిర్వహించాలన్న విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెల 17న గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రామజ్యోతిలో ఏడు ప్రధాన అంశాలపై దృష్టిసారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో పారిశుద్ధ్యం-తాగునీరు, గ్రామీణ ప్రజల ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, సామాజిక భద్రత-పేదరిక నిర్మూలన, సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన ఉన్నాయి. ఈ అంశాలపై గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రతి కమిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయంసహాయక సంఘా ల సభ్యులు ఉంటారు. ప్రతి గ్రామంలో ఏడు అంశాలపై కమిటీలు ఏర్పాటు చేసేలా, విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులను ఉత్తర్వుల్లో ఆదేశించారు.

రాష్ట్రంలో 8,685 గ్రామపంచాయతీలు, 87,838 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,26,88,576 గ్రామీణ జనాభా ఉండగా.. వీరిలో 29,01,266 మంది ఎస్టీలు, 4212,900 ఎస్సీలు ఉన్నారు. గ్రామ పంచాయతీలు అత్యంత కీలకపాత్ర పోషించాల్సి ఉన్నప్పటికీ నామమాత్రంగా మారిపోయాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర సామాజిక, ఆర్థిక కార్యక్రమాలలో కూడా గ్రామసభలు మొక్కుబడిగా నిర్వహించారు. దీంతో పారదర్శకత కొరవడింది. 14వ ఆర్థిక ప్రణాళిక ప్రకారం 2015-16 ఆర్థిక సంవత్సరం మొదలుకొని రాబోయే నాలుగేండ్లలో పంచాయతీలకు రూ.5375.53 కోట్లు అందనున్నాయి. ఇందులో 90శాతం బేసిక్ గ్రాంటు, 10శాతం పనితీరు గ్రాంటుగా 2015-16 సంవత్సరానికి ఇవ్వనున్నారు. ప్రాథమిక సేవలు, నిధుల సద్వినియోగం, పారదర్శకత నిధుల అందజేతకు తప్పనిసరని ప్రణాళిక సంఘం నిర్ణయించింది.
నిధులు వస్తున్నా.. దుర్వినియోగం
ఎన్నో ఏండ్లుగా గ్రామపంచాయతీలకు వివిధ ప్రభుత్వ శాఖలద్వారా అభివృద్ధి పథకాలకు నిధులు మంజురయ్యాయి. కానీ నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడంతో అవి దుర్వినియోగం అవుతున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నిధులను ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా ఖర్చు చేసేందుకు, ఉత్తమ ప్రణాళికలు రూపొందించేందుకు పంచాయతీ స్థాయిలో కమిటీలు అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల సమస్యలను చర్చించడం, విశ్లేషించడం, స్థానిక ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించడం, ఆర్థిక వనరులను సక్రమంగా అందజేయడం, వాటిని సరైన రీతిలో ఖర్చు చేయడం, వాటిపై పర్యవేక్షించడం, అవసరాలు, ప్రణాళికల మధ్య సారూప్యతను జోడించేందుకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రాణాళిక , కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


అభివృద్ధి ప్రణాళికలో కీలక అంశాలు
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం-ప్రజారోగ్యం, వీధి లైట్ల్లు, అంతర్గత రోడ్లు-డ్రైనేజీ నిర్వహణ, జనన, మరణ నమోదుతో పాటు పబ్లిక్ మార్కెట్లు, లైబ్రరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం, శిశుసంక్షేమం, పార్కులు, క్రీడామైదానాలు, గోదాములు, సహకారసంఘాలను ప్రోత్సహించడం, విపత్తుల నివారణ, ఉమ్మడి స్థలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, వివిధ రకాల అనుమతులు, శ్మశానాల నిర్వహణ-పారిశుద్ధ్యం- అక్రమణల నివారణవంటి సామాజిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు రాబోయే నాలుగేండ్లలో గ్రామపంచాయతీలు అభివృద్ధి ప్రణాళికను రూపొందించనున్నాయి.


పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు వనరులు
గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు పలు అర్థిక వనరులున్నాయి. లెవీ సేకరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చే పన్నుల నిధులు, వివిధ శాఖలు గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు ఉన్నాయి. ఇంటిపన్ను, ప్రకటనల పన్ను, ఫీజులు, దుకాణాలు, మార్కెట్ల నుంచి వచ్చే స్వంత పన్నులు. అదే విధంగా స్టాంపు డ్యూటీ, వినోదం పన్ను, వాటర్ సెస్ లాంటి అనుబంధ పన్నులతో పాటు కేంద్రంనుంచి వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చే ఎస్‌ఎఫ్‌సీ నిధులు, డొనేషన్లు, విదేశాలనుంచి వచ్చే నిధులు, స్వచ్ఛందంగా వచ్చే నిధులు కూడా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు దోహదం చేస్తాయి.

Tuesday, August 11, 2015

25వేల కోట్లతో గ్రామజ్యోతి గ్రామాల సంపూర్ణాభివృద్ధే లక్ష్యం

గ్రామ స్వరాజ్యం దిశగా మరో ముందడుగు పడింది. గ్రామసీమల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన గ్రామజ్యోతి కార్యక్రమ లక్ష్యాలను ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించారు. గ్రామాల్లో సంపూర్ణ మౌలికవసతుల కల్పన, సంపూర్ణ అక్షరాస్యత, సహకార, వ్యవసాయ, పాడిరంగాల అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఈ కార్యక్రమం రూపకల్పన జరిగింది. మౌలిక వసతుల్లో పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, డంపింగ్‌యార్డ్‌లు, శ్మశానాల ఏర్పాటువంటి అంశాలను చేర్చారు. హరితహారంతో పర్యావరణ రక్షణ, గుడుంబా నిర్మూలనతో దుర్వ్యసనాల ప్రక్షాళన, స్వయం ఉపాధి పథకాలతో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలని నిర్దేశించారు.
-మౌలిక వసతుల కల్పన, సంపూర్ణ అక్షరాస్యత, ప్రజల ఆర్థిక స్వావలంబన ప్రధానాంశాలు
-ప్రజల సంఘటిత శక్తే ప్రధాన వనరు
-గ్రామజ్యోతి తీరుతెన్నులు వివరించిన సీఎం కే సీఆర్
-మంత్రులు, అధికారులు, చేంజ్ ఏజెంట్స్‌తో అవగాహన సదస్సు
-ఏడు దశాబ్దాలు కావస్తున్నా అభివృద్ధి జాడలేదు
-ప్రణాళికల్లో ప్రజల భాగస్వామ్యం లేకే ఈ దుస్థితి
-గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్‌లే ఆదర్శం
-గ్రామజ్యోతిలో మార్పుసాధకులదే కీలక పాత్ర
-ప్రతి ఎమ్మెల్యే మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి: సీఎం
-స్వరాజ్యం దిశగా గ్రామజ్యోతి
-సంఘటిత శక్తిని చాటాలి


అన్ని పథకాల్లో ప్రజల భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తేవడమే గ్రామజ్యోతి లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రామజ్యోతి పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీవోలు, చేంజ్ ఏజెంట్స్, వివిధ శాఖల ఉన్నతాధికారుల అవగాహన సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆ లక్ష్యంతోనే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున తలపెట్టామని వివరించారు. గ్రామాల అభివృద్ధి పథకాలకు గ్రామస్తుల సమక్షంలో, వారి భాగస్వామ్యంతో రూపకల్పన జరపాలని అన్నారు. ప్రజలకు వారి సంఘటిత శక్తి విలువ ఏమిటో చెప్పడం ఈ పథకంలో ప్రధానాంశమని వెల్లడించారు.




రావాల్సిన మార్పు రాలేదు: కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఇలా సాగింది... ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో గ్రామాల్లో రావాల్సినంత గుణాత్మక మార్పు రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పద్ధతిలో అభివృద్ధి జరుగలేదు. గ్రామాలు, పట్టణాల్లో మార్పు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మానవ వనరులకు మించిన సంపద లేదు. ప్రజల సంఘటిత శక్తిలోని బలాన్ని ప్రజలకు చెప్పలేకపోయాం. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో కొంత పని జరిగినా, అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో మనం గ్రామజ్యోతి కార్యక్రమం తీసుకున్నాం.

Sunday, August 9, 2015

ఊరికి శ్రీమంతులు

ప్రతి పల్లె.. ఓ దత్త పుత్రిక
ఊరు నుంచి చాలా తీసుకున్నాను. తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతా!నన్నుకూడా నాకు తోచింది చేయనివ్వండి. లెట్ మీ ఎర్న్ సమ్ రెస్పెక్ట్!! ఊరు.. దత్తత ప్రాధాన్యం చెప్పిన శ్రీమంతుడి డైలాగ్స్ ఇవి! పిల్లల్ని దత్తత తీసుకోవడం పాతమాట. ఊర్లను దత్తత తీసుకోవడం ఇప్పటిమాట! గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనే బాధ్యతగా మార్చుకుంటున్న సరికొత్త ట్రెండ్! పీఎం.. సీఎం.. అందరూ దత్తతతో గ్రామజ్యోతిని వెలిగించేందుకు వస్తున్న ఊరికి శ్రీమంతులు!!



ఫారిన్ నుంచి ఓ ధనిక యువకుడు పచ్చని పల్లెటూరుకి వస్తాడు. పండగలకు.. పబ్బాలకు మాత్రమే సొంతూరుకి రావడం కాదు. వెలకట్టలేని ఆస్తిని ఇచ్చిన ఆ ఊరికి ఏదో ఒక మేలు చేయాలని గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. శ్రీమంతుడులోని ఈ థీమ్.. సామాజిక స్పృహను కల్పిస్తోంది! దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు! అనే మాటని మరోసారి గుర్తుకుతెచ్చేట్లు చేస్తోంది. దాన్ని నిజం చేయాల్సిన ఆవశ్యకత ఉందని మనసుల్ని తడుతూ.. తనలాంటి శ్రీమంతుల్ని ఊరుబాట పట్టిస్తోంది! దేశ పునర్నిర్మాణం జరిగి గ్రామస్వరాజ్యం రావాలంటే ఇవన్నీ అవసరమే కదా మరి!

దత్త పుత్రిక..
గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే లక్ష్యంతో భారతప్రధాని నరేంద్రమోడీ! సంసద్ ఆదర్శ్ యోజన పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి పరచేందుకు శ్రీకారం చుట్టారు. ఇదేబాటలో తెలంగాణ సర్కార్ కూడా నడుస్తోంది. ఆదర్శ్ యోజన తరహాలోనే సరికొత్త గ్రామజ్యోతి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యతను ప్రజాప్రతినిధులకు.. అధికారులకు అప్పగించింది! ఇప్పడు శ్రీమంతుడు కూడా ఈ థీమ్‌తో వచ్చినదే.

ఉద్యమంలా గ్రామజ్యోతి


రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధిలో ప్రజలను సంపూర్ణంగా భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకం మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు చేరింది. మార్గదర్శకాల రూపకల్పనకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తన పనిని ముగించింది.

-తుదిదశకు చేరిన పథకం మార్గదర్శకాల రూపకల్పన
-అభిప్రాయ సేకరణ పూర్తిచేసిన మంత్రివర్గ ఉపసంఘం
-రేపు సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ
-12న టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
-గ్రామజ్యోతి లక్ష్యాలు, ఉద్దేశాలపై మార్గదర్శనం చేయనున్న సీఎం

ఈ ఉపసంఘం పలు దఫాలుగా సమావేశమై జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈనెల 17 నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకం అమలులో కీలకంగా మారనున్న పంచాయతీ సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన హైదరాబాద్‌లో సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో గ్రామజ్యోతి ఉద్దేశాలు, లక్ష్యాలు, మార్గదర్శకాలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం మార్గదర్శనం చేయనున్నారు. అంతేకాకుండా గ్రామజ్యోతి పథకాన్ని మిషన్ కాకతీయ, హరితహారం పథకాల మాదిరిగా విజయవంతం చేసేందుకు అధికార టీఆర్‌ఎస్ శ్రేణులను కూడా భాగస్వామ్యం చేయాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 12న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లకు అవగాహన కల్పించేందుకు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

గ్రామజ్యోతి ముసాయిదాలోని కీలకాంశాలు
1. గ్రామసభ: మూడు నెలలకోసారి జరిగే గ్రామసభ గ్రామాభివృద్ధిపై చర్చించడంతోపాటు గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తుంది. ఫలితంగా పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుంది. పంచాయతీల పాలనపై అవగాహన కల్పించడం, సామర్థ్యాల పెంపు ద్వారా వాటిని బలోపేతం చేయనున్నారు.
2. పారిశుద్ధ్యానికే తొలి ప్రాధాన్యం: ఈ నెల 17 నుంచి వారంపాటు గ్రామజ్యోతిలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వనున్నారు. శ్రమదానం, పంచాయతీ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. దళితవాడలు, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు.
3. మౌలిక సదుపాయాల కల్పన: ఏటా వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నా గ్రామాల్లో కనీస వసతుల్లేని పరిస్థితికి ముగింపు పలకాలన్నది లక్ష్యం. ప్రణాళికబద్ధమైన అభివృద్ధితో పల్లెల్లో జీవన స్థితిగతులను మెరుగుపరచనున్నారు. గ్రామాల్లో సేవలందించే శాఖలు పంచాయతీలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తుండటంతో పర్యవేక్షణ లోపిస్తున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు కీలక శాఖలను జవాబుదారీ చేయాలన్న ఆలోచన ప్రాధాన్యం సంతరించుకుంది.