Sunday, August 9, 2015

ఉద్యమంలా గ్రామజ్యోతి


రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధిలో ప్రజలను సంపూర్ణంగా భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకం మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు చేరింది. మార్గదర్శకాల రూపకల్పనకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తన పనిని ముగించింది.

-తుదిదశకు చేరిన పథకం మార్గదర్శకాల రూపకల్పన
-అభిప్రాయ సేకరణ పూర్తిచేసిన మంత్రివర్గ ఉపసంఘం
-రేపు సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ
-12న టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
-గ్రామజ్యోతి లక్ష్యాలు, ఉద్దేశాలపై మార్గదర్శనం చేయనున్న సీఎం

ఈ ఉపసంఘం పలు దఫాలుగా సమావేశమై జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈనెల 17 నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకం అమలులో కీలకంగా మారనున్న పంచాయతీ సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన హైదరాబాద్‌లో సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో గ్రామజ్యోతి ఉద్దేశాలు, లక్ష్యాలు, మార్గదర్శకాలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం మార్గదర్శనం చేయనున్నారు. అంతేకాకుండా గ్రామజ్యోతి పథకాన్ని మిషన్ కాకతీయ, హరితహారం పథకాల మాదిరిగా విజయవంతం చేసేందుకు అధికార టీఆర్‌ఎస్ శ్రేణులను కూడా భాగస్వామ్యం చేయాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 12న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లకు అవగాహన కల్పించేందుకు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

గ్రామజ్యోతి ముసాయిదాలోని కీలకాంశాలు
1. గ్రామసభ: మూడు నెలలకోసారి జరిగే గ్రామసభ గ్రామాభివృద్ధిపై చర్చించడంతోపాటు గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తుంది. ఫలితంగా పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుంది. పంచాయతీల పాలనపై అవగాహన కల్పించడం, సామర్థ్యాల పెంపు ద్వారా వాటిని బలోపేతం చేయనున్నారు.
2. పారిశుద్ధ్యానికే తొలి ప్రాధాన్యం: ఈ నెల 17 నుంచి వారంపాటు గ్రామజ్యోతిలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వనున్నారు. శ్రమదానం, పంచాయతీ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. దళితవాడలు, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు.
3. మౌలిక సదుపాయాల కల్పన: ఏటా వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నా గ్రామాల్లో కనీస వసతుల్లేని పరిస్థితికి ముగింపు పలకాలన్నది లక్ష్యం. ప్రణాళికబద్ధమైన అభివృద్ధితో పల్లెల్లో జీవన స్థితిగతులను మెరుగుపరచనున్నారు. గ్రామాల్లో సేవలందించే శాఖలు పంచాయతీలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తుండటంతో పర్యవేక్షణ లోపిస్తున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు కీలక శాఖలను జవాబుదారీ చేయాలన్న ఆలోచన ప్రాధాన్యం సంతరించుకుంది.

4. సమర్థ పాలనా వ్యవస్థ: పరిపాలనా విధానాలపై అవగాహన కల్పించి సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పాలనపై సాధికారత కల్పించనున్నారు. పంచాయతీలను కంప్యూటరీకరించడం ద్వారా పారదర్శకతతోపాటు ఇతర సేవలందించేలా చేయడం, వందశాతం జనన మరణాల నమోదు దీనిలో కీలకాంశాలు.
5. వసతుల కల్పన: గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా, వ్యక్తిగత మరుగుదొడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం వందం శాతం చేయాలన్నది గ్రామజ్యోతి సంకల్పం. మెరుగైన పారిశుద్ధ్యం, పూర్తిస్తాయిలో వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల నిర్మాణం నిర్వహణ, ఆటస్థలాలు, పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించనున్నారు.

6. వైద్యం, ఆరోగ్యం: అంగన్‌వాడీల ద్వారా నూరుశాతం గర్భిణుల నమోదు, వారికి పౌష్టికాహారం పంపిణీ, దవాఖానల్లోనే కాన్పులు జరిగేలా చూడటం, మాతా,శిశు సంరక్షణ, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ, కుటుంబ నియంత్రణ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు.
7. విద్య: గ్రామాల్లో 6-14 ఏండ్లలోపు అర్హులైన పిల్లలందరినీ పాఠశాలలు, వసతిగృహాల్లో చేర్చించడం, వారు మధ్యలో బడి మానేయకుండా పర్యవేక్షణ, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. 15 ఏండ్లపైబడిన నిరక్షరాస్యులకు వయోజన విద్య అందించనున్నారు.
8. సంక్షేమం, పథకాల అమలు: సామాజిక పింఛన్ల పంపిణీ సహా సంక్షేమ పథకాలన్నీ అర్హులకు దక్కేలా పర్యవేక్షించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. పంచాయతీల ద్వారా ఉపాధి హామీ పథకం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నారు. మెరుగైన ప్రజాపంపిణీ వ్యవస్థతో పాటు రైతులకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల ద్వారా సేవలందేలా పర్యవేక్షణ. పంచాయతీ ఆస్తులు, భూముల సంరక్షణ, వనరుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు.

పంచాయతీలకు జవాబుదారీగా ఉండే విభాగాలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, మహిళా -శిశుసంక్షేమశాఖ, విద్య, వైద్య, ఆరోగ్య శాఖల్లోని కిందస్థాయి విభాగాలు పంచాయతీలకు జవాబుదారీ కానున్నాయి.

పంచాయతీల పర్యవేక్షణలో ఉండేవి
ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రం, చౌకధరల దుకాణం, స్వయం సహాయక సంఘాలు, వాటర్‌షెడ్ కమిటీలు, వనసంరక్షణ సమితులు.

No comments:

Post a Comment