Friday, August 14, 2015

పల్లె సీమల ప్రగతి చిత్రం


-గ్రామజ్యోతి మార్గదర్శకాలు ఖరారు
-ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
-ఏడు అంశాలపై గ్రామాల్లో ప్రత్యేక కమిటీలు
-వాటి పర్యవేక్షణలోనే అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన
-నేడు అధికారిక ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
-17న గంగదేవిపల్లిలో లాంఛనంగా కార్యక్రమ ప్రారంభం


తెలంగాణ పల్లె సీమల చిత్రాన్ని సమూలంగా మార్చివేసేందుకు, ప్రగతిబాటన ఉరకలెత్తించేందుకు, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడంద్వారా గ్రామపంచాయతీలు స్వయం సమృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమం విధివిధానాలు వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. గ్రామం మొదలుకొని జిల్లాస్థాయివరకు ఎవరెవరు ఏయే విధులు నిర్వహించాలన్న విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెల 17న గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రామజ్యోతిలో ఏడు ప్రధాన అంశాలపై దృష్టిసారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో పారిశుద్ధ్యం-తాగునీరు, గ్రామీణ ప్రజల ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, సామాజిక భద్రత-పేదరిక నిర్మూలన, సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన ఉన్నాయి. ఈ అంశాలపై గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రతి కమిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయంసహాయక సంఘా ల సభ్యులు ఉంటారు. ప్రతి గ్రామంలో ఏడు అంశాలపై కమిటీలు ఏర్పాటు చేసేలా, విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులను ఉత్తర్వుల్లో ఆదేశించారు.

రాష్ట్రంలో 8,685 గ్రామపంచాయతీలు, 87,838 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,26,88,576 గ్రామీణ జనాభా ఉండగా.. వీరిలో 29,01,266 మంది ఎస్టీలు, 4212,900 ఎస్సీలు ఉన్నారు. గ్రామ పంచాయతీలు అత్యంత కీలకపాత్ర పోషించాల్సి ఉన్నప్పటికీ నామమాత్రంగా మారిపోయాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర సామాజిక, ఆర్థిక కార్యక్రమాలలో కూడా గ్రామసభలు మొక్కుబడిగా నిర్వహించారు. దీంతో పారదర్శకత కొరవడింది. 14వ ఆర్థిక ప్రణాళిక ప్రకారం 2015-16 ఆర్థిక సంవత్సరం మొదలుకొని రాబోయే నాలుగేండ్లలో పంచాయతీలకు రూ.5375.53 కోట్లు అందనున్నాయి. ఇందులో 90శాతం బేసిక్ గ్రాంటు, 10శాతం పనితీరు గ్రాంటుగా 2015-16 సంవత్సరానికి ఇవ్వనున్నారు. ప్రాథమిక సేవలు, నిధుల సద్వినియోగం, పారదర్శకత నిధుల అందజేతకు తప్పనిసరని ప్రణాళిక సంఘం నిర్ణయించింది.
నిధులు వస్తున్నా.. దుర్వినియోగం
ఎన్నో ఏండ్లుగా గ్రామపంచాయతీలకు వివిధ ప్రభుత్వ శాఖలద్వారా అభివృద్ధి పథకాలకు నిధులు మంజురయ్యాయి. కానీ నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడంతో అవి దుర్వినియోగం అవుతున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నిధులను ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా ఖర్చు చేసేందుకు, ఉత్తమ ప్రణాళికలు రూపొందించేందుకు పంచాయతీ స్థాయిలో కమిటీలు అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల సమస్యలను చర్చించడం, విశ్లేషించడం, స్థానిక ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించడం, ఆర్థిక వనరులను సక్రమంగా అందజేయడం, వాటిని సరైన రీతిలో ఖర్చు చేయడం, వాటిపై పర్యవేక్షించడం, అవసరాలు, ప్రణాళికల మధ్య సారూప్యతను జోడించేందుకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రాణాళిక , కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


అభివృద్ధి ప్రణాళికలో కీలక అంశాలు
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం-ప్రజారోగ్యం, వీధి లైట్ల్లు, అంతర్గత రోడ్లు-డ్రైనేజీ నిర్వహణ, జనన, మరణ నమోదుతో పాటు పబ్లిక్ మార్కెట్లు, లైబ్రరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం, శిశుసంక్షేమం, పార్కులు, క్రీడామైదానాలు, గోదాములు, సహకారసంఘాలను ప్రోత్సహించడం, విపత్తుల నివారణ, ఉమ్మడి స్థలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, వివిధ రకాల అనుమతులు, శ్మశానాల నిర్వహణ-పారిశుద్ధ్యం- అక్రమణల నివారణవంటి సామాజిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు రాబోయే నాలుగేండ్లలో గ్రామపంచాయతీలు అభివృద్ధి ప్రణాళికను రూపొందించనున్నాయి.


పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు వనరులు
గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు పలు అర్థిక వనరులున్నాయి. లెవీ సేకరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చే పన్నుల నిధులు, వివిధ శాఖలు గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు ఉన్నాయి. ఇంటిపన్ను, ప్రకటనల పన్ను, ఫీజులు, దుకాణాలు, మార్కెట్ల నుంచి వచ్చే స్వంత పన్నులు. అదే విధంగా స్టాంపు డ్యూటీ, వినోదం పన్ను, వాటర్ సెస్ లాంటి అనుబంధ పన్నులతో పాటు కేంద్రంనుంచి వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చే ఎస్‌ఎఫ్‌సీ నిధులు, డొనేషన్లు, విదేశాలనుంచి వచ్చే నిధులు, స్వచ్ఛందంగా వచ్చే నిధులు కూడా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు దోహదం చేస్తాయి.


కమిటీ నిర్మాణం, పనితీరు :
- ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉంటారు. అతని సలహామేరకు కమిటీ పనిచేస్తుంది.
- గ్రామపంచాయతీ/మండలస్థాయి అధికారి కన్వీనర్‌గా ఉంటారు.
- కమిటీలో ఒకరికంటే ఎక్కువ మంది వార్డు సభ్యులు,
- స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలు,
- గ్రామపంచాయతీ పరిధిలో పనిచేసే ఎన్జీవో లేదా ఏదైనా కమ్యూనిటీ ఆధారిత సంస్థకు చెందిన ప్రతినిధి,
- పంచాయతీ పరిధిలో పదవి విరమణ పొంది, సంబంధిత అంశంపై అనుభవం ఉన్న ఉద్యోగి సభ్యులుగా ఉంటారు.
- ప్రాధాన్యాలు, విధానాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కమిటీ పొందికను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
- కో ఆప్షన్ సభ్యుడిగా ఉండే ప్రభుత్వ అధికారి ఆయన హోదాతో సభ్యుడిగా ఉంటాడు. అంతేకానీ ఆయన పేరు మీద కాదు.
- వార్డుమెంబర్లు కానివారితోపాటు ఫంక్షనల్ కమిటీ సభ్యుల పదవీకాలం సంబంధిత పంచాయతీ పదవీకాలం మేరకు ఉంటుంది.
- ప్రతి ఫంక్షనల్ కమిటీ తన అంశానికి సంబంధించి గ్రామస్థాయిలో అమలుచేస్తున్న పథకాలు, పనుల ప్రగతిని పరిశీలించాలి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రణాళిక తయారు చేయాలి. నిర్దిష్టకాలపరిమితిలో ఫలితాలు రాబట్టాలి.


గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీలో ఫంక్షనల్ కమిటీలు అనుసరించాల్సిన పద్ధతులు:
- వివిధ శాఖల ప్రతినిధుల నుంచి కార్యక్రమాల అమలుకోసం అవసరమైన వివరాలు సేకరించడం
- సేవల తాజా పరిస్థితులపై సమీక్షలు
- గ్రామ పరిస్థితులను తనిఖీ చేయాలి.
- పరిస్థితులకు అనుగుణంగా విశ్లేషించాలి.
- నిర్ణయాలు తీసకునే సమయంలో భాగస్వామ్య పద్ధతులు అవలంబించడం
- కమ్యూనిటీ అవసరాలను అంచనా వేయడం
- వనరుల లభ్యతపై సమీక్షించుకోవడం
- సెక్టర్ కోసం ప్రణాళిక సిద్ధం చేయడం, వనరులు కేటాయించడం, ఫలితాలపై గ్రామ సభ ఆమోదం తీసుకోవడం

గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారీలో ఫంక్షనల్ కమిటీ పాత్ర, బాధ్యతలు

1. పారిశుద్ధ్యం, తాగునీటి కమిటీ :
- ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తాడు.
- పరిశుభ్రమైన, రక్షిత మంచినీటి సరఫరా కోసం గ్రామీణ నీటిపారుదల శాఖతో ఈ కమిటీ నిత్యం సంప్రదింపులు జరుపుతుంది. గ్రామపంచాయతీని బహిరంగ మల విసర్జన రహితం చేసేందుకు మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తుంది. పంచాయతీల్లో గ్రామీణ నీటి సరఫరా పరిస్థితి, అభివృద్ధిపై పంచాయతీకి ఎప్పటికప్పుడు ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖలోని అసిస్టెంట్ ఇంజినీర్ సమాచారం ఇస్తూ ఉండాలి.
-పరిసరాల పరిశుభ్రతను కాపాడటం, స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయడం ఈ కమిటీ ప్రాథమిక బాధ్యత. ప్రజారోగ్యం, ఆరోగ్యకరమైన గ్రామం అనేదానికి ఇవి అంతఃసంబంధం కలిగి ఉండి పునాదులుగా ఉంటాయి.
- ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు అందించే వాటర్‌గ్రిడ్ పథకంలో గ్రామపంచాయతీలది ప్రధాన పాత్ర. ప్రతి కుటుంబం ఈ పథకం నిర్వహణ కోసం వాటర్ చార్జీలను క్రమం తప్పకుండా చెల్లించేలా చూడాలి.
- పైపులు, కుళాయిల వద్ద నీటి లీకేజీని గుర్తించడం, అరికట్టడం.
- సంతృప్తి స్థాయిలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించడం అనే లక్ష్యం పెట్టుకోవాలి. గ్రామపంచాయతీని బహిరంగ మల విసర్జన రహితంగా మార్చే చర్యలు పారిశుధ్య ప్రణాళికలో ఉండాలి. ఇందుకోసం ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టాలి.
- ఘన, ద్రవ వ్యర్థాల నిర్దిష్ట నిర్వహణ ద్వారా పరిశుభ్రమైన గ్రామం దిశగా ప్రణాళిక ఉండాలి.
- నీటిద్వారా సోకే వ్యాధులను నిరోధించాలి. దోమల వృద్ధిని నియంత్రించడం ద్వారా, నీరు కలుషితం కాకుండా చూడటం ద్వారా ఇటువంటి వ్యాధులను సులభంగా నివారించవచ్చు.
- గ్రామంలో దోమల్లేకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా, ఏడాది పొడవునా స్వచ్ఛమైన మంచీనిరు అందించడం అనేవి ఈ ప్రణాళికలో ఉండాలి.


2. ఆరోగ్యం, పోషకాహారంపై కార్యాచరణ కమిటీలు:


- వార్డు సభ్యుల్లో ఒక మహిళ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉంటారు. కమిటీ సభ్యులుగా పైన పేర్కొన్న వారు ఉంటారు.
- ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు చేసే ప్రనిని ఈ కమిటీ లోతుగా పర్యవేక్షిస్తూ, సమన్వయం చేస్తుంది. అవసరమైతే ఉన్నతస్థాయి హాస్పిటళ్లకు పంపేందుకు, తీవ్రమైన అనారోగ్యాలైతే ఆరోగ్యశ్రీ పథకం కింది చికిత్స పొందేందుకు సహకరిస్తారు.
- తల్లీ, పిల్లలు, పెద్దల ఆరోగ్య సమస్యల పరిస్థితిపై గ్రామ సభకు, ఫంక్షనల్ కమిటీకి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు నివేదించాలి.
- కమిటీ ప్రధానంగా గర్భిణీలు, శిశువుల ఆరోగ్యం, సాధారణ ఆరోగ్యం, ఆరోగ్య సేవల అందుబాటు అనే మూడు ప్రధానాంశాలపై దృష్టిసారిస్తుంది.
- మాతా సంరక్షణ, పిల్లల ఆరోగ్యం, గర్భిణులు, గర్భరక్షణ, గర్భధారణ సమయంలో తల్లి మరణాల నమోదు, జననాల నమోదు, పిల్లల బరువు, తల్లీపిల్లలకు పోషకాహారం, బాల్య వివాహాల నివారణవంటి అంశాలపై పర్యవేక్షిస్తుంది.
- గ్రామపంచాయతీ పరిధిలోని ఈ కమిటీ 104 సేవలపై భరోసా కల్పించడం, అత్యవసరణ సంరక్షణ, ప్రతిస్పందనల కోసం 108 సేవలను సమీక్షించడం.
- కల్తీ సారా తయారీని అరికట్టడం. n ప్రసూతి మరణాలు తగ్గించడం. n దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడం


3. విద్య కమిటీ -విధులు :


- ఆరు నుంచి14 సంవత్సరాల్లోపు బాలబాలికలను 100శాతం పాఠశాలలో చేర్పించడమే ఈ కమిటీ లక్ష్యం
-మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలు లేదా నర్సరీ పాఠశాలలో చేర్పించడం.
-మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణ
- స్కూళ్లల్లో మెరుగైన విద్య అందించడం.
- గురుకులాలు, అశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం ఉన్న విద్యార్థులను గుర్తించడం.
- గ్రామంలో నిరక్షరాస్యులను గుర్తించి, వారిని అక్షరాస్యులను చేయడం.


4. సామాజిక భద్రత, పేదరిక నిర్వహణ కమిటీ -విధులు :


- వీలున్నత వరకూ ఎస్సీ/ఎస్టీ సభ్యురాలు ఈ కమిటీకి చైర్మన్. ఇందులో పలువురు సభ్యులు ఉంటారు.
- సామాజికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రణాళికలను రూపొందించడం.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గాలకోసం కేటాయించిన నిధులకు లబ్ధిదారులను గుర్తించడం, ఖర్చు చేయడం.
- స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద బీమా, పెన్షన్, ఇండ్ల పథకాలు అందించడం.
- గిరిజన ఉప ప్రణాళిక అమలు గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఉండాలి.


5. సహజ వనరుల నిర్వహణ కమిటీ -విధులు :

- సర్పంచ్ ఈ కమిటీకి చైర్మన్. దీనిలో ఇతర సభ్యులుంటారు.
- జీవనాధారానికి, సురక్షిత వాతావరణం, సహజవనరుల నిర్వహణపై దృష్టి
- స్థిరమైన వ్యవసాయానికి చేయూత నివ్వడం
- నేలలు, భూగర్భ జలాలు క్షీణించకుండా చర్యలు.
- సమీకృత నీటి నిర్వహణ కార్యక్రమం, జాతీయ ఉపాధి పథకం ద్వారా నేల, జల సంరక్షణకు ప్రణాళికలు రూపొందించడం.
- ఏపీవో, ఈజీఎస్‌ల సమన్వయంతో కమిటీలు ఏర్పాటు .
- పీవో, ఐడబ్ల్యూఎంపీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్, వాటర్‌షెడ్ సహాయకులుగా గ్రామస్థాయిలో తెలంగాణకు హరితహారం ద్వారా వచ్చే మూడేండ్లలో ఏడాదికి 40వేల చొప్పున మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించాలి.

6. వ్యవసాయ కమిటీ- విధులు :
- ఈ కమిటీకి గ్రామ ఉప సర్పంచ్ చైర్మన్
- వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థలను మెరుగుపర్చడం.
- సబ్సిడీ విత్తనాల సరఫరా, భూసార పరీక్షల కార్డుల నిర్వహణ, వీఎల్‌ఆర్, పావలా వడ్డీ పథకాలు, రుణ మాఫీ పథకం ద్వారా లబ్ధిపొందేలా చూడటం.

7. మౌలిక సదుపాయాల కల్పన కమిటీ - విధులు :
- ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్. దీనిలో ఇతర సభ్యులుంటారు.
- అంతర్గత రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించడం.
- గ్రామీణ రోడ్ల వెంట ముళ్ల పొదల తొలగింపు.
- ఎస్సీ, ఎస్టీ కాలనీలలో సబ్‌ప్లాన్ నిధుల ద్వారా రహదారులు, కాలువల నిర్మాణాలు చేపట్టడం.
- డ్రైనేజీలను ఎప్పటికప్పడు శుభ్రం చేయడం
- గ్రామంలో గుంటలను పూడ్చడం.
- అన్ని గ్రామపంచాయతీల భవనాలు, వీధిలైట్లు, మోటార్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు.
- ఇంధన పొదుపు పాటించేలా సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ, సోలార్ లైట్లను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించడం.
- పన్నులను వసూలు చేయడం.

అధికారుల బాధ్యతలు : జిల్లాస్థాయి అధికారి గ్రామ స్థాయిలోని అన్ని స్థాయి అంశాల రూపకల్పనను పర్యవేక్షించాలి. పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు తగిన సౌకర్యాల కల్పన, ప్రజల భాగస్వామ్యం కోసం పూర్తిస్థాయిలో కృషి చేయాలి. ప్రత్యేకాధికారులు ఈ క్రమంలో అన్ని అంశాలను కూలం కుషంగా పరిశీలించి అందరి భాగస్వామ్యంతో ప్రణాళికను రూపొందించాలని మార్గదర్శకాలలో స్పష్టం చేశారు.
మండలస్థాయి కమిటీ : ఎంపీడీవో, తహశీల్దార్, ఈవోపీఆర్డీ , పీఆర్ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, ట్రాన్స్‌కో ఏఈ, మెడికల్ ఆఫీసర్, వ్యవసాయాధికారి, ఐకేపీ ఏపీఎంల సమన్వయంతో మండల ప్రణాళికలు రూపొందించాలి.
మండల చేంజ్ ఏజెంట్స్ : వివిధ అవసరాలను సమన్వయం చేసుకుంటూ, ఆయా మండలాల మధ్య, గ్రామాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. జిల్లా, మండలస్థాయి అధికారులకు తగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తారు.
డివిజనల్ పంచాయతీ అధికారి : గ్రామస్థాయి నుంచి మొదలుకొని మండలస్థాయి వరకు వివిధ కమిటీల్లోని సభ్యులను సమన్వయం చేసుకుంటూ సమాచారాన్ని తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేస్తూ గ్రామ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి.
జిల్లా నోడల్ అధికారి : జిల్లా కలెక్టర్‌కు సహాయకారిగా ఉంటూ, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం నుంచి వచ్చే నివేదికలను జిల్లా, మండలం, గ్రామ స్థాయి కమిటీలకు తెలియజేయడం, క్షేత్రస్థాయినుంచి వచ్చే నివేదికలను కమిషనర్‌కు అందజేయాలి..

సాఫ్ట్‌వేర్ : గ్రామజ్యోతి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అప్‌లోడ్, డౌన్‌లోడ్‌కు http://tspri.cgg.gov.in పేరుతో ప్రత్యేక సాఫ్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు. అన్ని జిల్లాల కలెక్టర్లు గ్రామజ్యోతిపై తగిన ప్రచారం, అవగాహన కల్పించాలని, విరివిగా ప్రజలను, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని, గ్రామజ్యోతిని విజయవంతం చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
పథకాలు, ప్రాథమ్యాలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో అమలవుతున్న సంక్షేమపథకాలు, చేపడుతున్న పనుల మధ్య సమన్వయం సాధించి అభివృద్ధి దిశగా గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు మండలస్థాయి అధికారులు కంకణ బద్దులై పనిచేయాలని గ్రామజ్యోతి మార్గదర్శకాలలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ అభివృదిధ ప్రణాళిక ముసాయిదాను లోపరహితంగా తీర్చిదిద్దనున్నారు. అనంతరం భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని అవసరాలు, అందుబాటులో ఉన్న నిధులు, పథకాలు అన్నింటినీ బేరీజు వేసుకొని తుది గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్), గ్రామీణ నీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) వంటి పథకాల కేంద్రీకరణకు విస్తృత అవకాశం ఉంది.
1. పంచాయతీ పరిధిలో ఇంటింటికీ సర్వే నిర్వహించి, మరుగుదొడ్లు లేని ఇండ్ల సంఖ్య గుర్తించవచ్చు. తద్వారా సంతృప్త స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించి, ఆరోగ్యకరమైన గ్రామాన్ని తయారు చేసుకోవచ్చు.
2. తడి, పొడి వ్యర్థాల నిర్వహణకు డంప్‌లు గుర్తించడం, చెత్త రవాణా కోసం ఏర్పాట్లు చేయడం: ఫలితంగా చెత్త, దూళి లేని పరిసరాలు తయారు చేసుకోవచ్చు.
3. దోమల నియంత్రణ: మురుగు నీరు నిల్వ ఉంటున్న గుంటలను, కాలువలను గుర్తించడం. తద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడు వాపు వ్యాధులను అరికట్టవచ్చు.
4. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడం, క్లోరినేషన్ చేయడంద్వారా విరేచనాలు, అతిసారం, కామెర్లు, కలరావంటి వ్యాధులను నివారించవచ్చు.
5. నల్లా నీటి సరఫరా అమలు సమన్వయం, కుళాయిల బిల్లుల వసూళ్లు: అమూల్యమైన నీటిని కాపాడుకోవటం.





































No comments:

Post a Comment