Thursday, July 30, 2015

‘గ్రామజ్యోతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సమీక్ష సమావేశం




పంచాయితీ రాజ్ ఉద్యమ స్ఫూర్తిని గ్రామ స్థాయిలో తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి, పంచాయితీ రాజ్ వ్యవస్థ ద్యారా మార్పు సాధించాలన్నారు. ‘గ్రామజ్యోతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి.లో గురువారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సిఎం శ్రీ కడియం శ్రీహరి, మంత్రులు శ్రీ కె. తారక రామారావు, శ్రీ ఈటెల రాజెందర్, శ్రీ టి. హరీష్ రావు, శ్రీ జోగు రామన్న, శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీ జగదీష్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ, డిజిపి శ్రీ అనురాగ్ శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి సెషన్ లో ముఖ్యమంత్రి మాట్లాడారు.

‘‘భారతదేశంలో పంచాయితీ రాజ్ వ్యవస్థ, సహకార వ్యవస్థ ఉద్యమంలోంచి పుట్టుకొచ్చినవి. దేశ మొదటి కమ్యూనిటీ డెవలప్ మెంట్ మంత్రి ఎస్.కె.డే హైదరాబాద్ కేంద్రంగా పంచాయితీ రాజ్ సంస్థల విస్తరణకు కృషి చేశారు. క్షేత్ర స్థాయిలో అవసరాలకు అనుగుణంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యాక్రమాలు నడవాలి. ప్రజల సంఘటిత శక్తిలోని బలమేంటో గుర్తెరగాలి. ప్రజలు కలిసి పని చేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో వారికి చెప్పాలి. ఏ ఊరికి ఆ ఊరు ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రజలకు నేర్పాలి. మనం ఈ పాఠాలను ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వరంగల్ జిల్లా గంగదేవి పల్లి, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ లాంటి గ్రామాలు మనకు పంచయతీరాజ్ వ్యవస్థకు, కరీంనగర్ జిల్లా ముల్కనూరు సహకార వ్యవస్థకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయని అన్నారు. తాగే మంచి నీళ్లు కూడా లేని సింగపూర్ లాంటి దేశాలు ప్రపంచాన్నే శాసించే స్థితికి చేరుకున్న ఉదంతాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.”

“పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రజలే సారథులుగా ఉండాలి. గ్రామజ్యోతి కార్యక్రమం ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు చేపడుతున్నాము. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరిగితే ఫలితం రాదు. ప్రభుత్వం కేవలం ఆర్థిక ప్రేరణగా ఉండాలి. కావలసిన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉంటుంది. కానీ నిజంగా మార్పు సాధించాల్సింది ప్రజలే. వారేమి చేయాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో అధికారులు ప్రజలకు చెప్తారు. జిల్లాలో ఉండే అధికారులు ఒక్కో మండలానికి ఒకరు ఛేంజ్ ఏజెంట్స్ గా వ్యవహరించాలి. నిర్లక్ష్యానికి గురైన దళిత వాడలు, గిరిజన తాండాలనుంచి మార్పుకు శ్రీకారం చుట్టాలి. గ్రామాలను అన్ని రకాలుగా తీర్చిదిద్దుకోవాలి. స్థానిక సంస్థల ద్వారా వివిధ పథకాల పేరిట వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ గ్రామాల్లో అసెట్స్ క్రియేట్ కావడం లేదు. ప్రతి గ్రామానికి వచ్చే ఐదేళ్ల ప్రణాళిక సిద్దం కావాలి. గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాలు రూపొందించాలి. దానికి అనుగుణంగా పనులు జరగాలి. అవసరమైన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు ప్రజల సంఘటిత శక్తి తోడైతేనే మార్పు, ప్రగతి సాధ్యమవుతుంది. బాగా పనిచేసిన గ్రామాలకు అవార్డులు ఇవ్వాలి. గ్రామజ్యోతి కార్యక్రమం మాదిరిగానే ‘పట్టణ జ్యోతి’ కార్యక్రమం చేపడతాము. పట్టణాల్లో కూడా మార్పు రావాలి. చిత్తశుద్ధి, పట్టుదల వున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేసిన దగ్గర మంచి ఫలితాలు వచ్చాయి. మిగతా చోట్ల కూడా అదే తీరుగా మారాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘గోదావరి పుష్కరాలను అధికారులు అద్భుతంగా నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలు రేయింబవళ్లు కష్టపడ్డారు. పోలీసులు చాలా మర్యాదగా ప్రవర్తించారు. అందరికి అభినందనలు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే మేడారం జాతరను, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని పుష్కరాలు నిరూపించాయి’’ అని సిఎం చెప్పారు.

“ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ చాలా గొప్పగా జరిగింది. దేశం దృష్టిని ఆకర్షించింది. నీతి ఆయోగ్ అధికారులు, హైకోర్టు న్యాయ మూర్తులు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఇదే స్పూర్తితో ‘గ్రామ జ్యోతి’ కార్యక్రమం నిర్వహించాలి. ‘గ్రామ జ్యోతి’ అంటే గ్రామాలకు నిధులు కేటాయించడమే కాదు, ప్రతి పౌరుణ్ణి చైతన్య పరిచి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. ఎవరి ఇంటి కోసం వాళ్లు బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ గ్రామం విషయం వచ్చే సరికి ఎవరికీ సంబంధం లేదనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఎవరింటి కోసం వాళ్లు ప్లాన్ చేసుకున్నట్లే ఎవరి ఊరికి వారు ప్లాన్ చేసుకోవాలి ’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

మొదటి దశలో ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలి. పరిశుభ్రమయిన, ఆరోగ్యకరమైన వాతావరణంలో గ్రామాలుండే విధంగా ప్రజలు సంఘటిత శక్తితో పనిచేయాలి. ఆ గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుంది. అయితే ఏ గ్రామానికి ఏ సదుపాయం అత్యవసరమో ప్రజలే నిర్ణయించాలి. ఈ సందర్భంగా ‘గ్రామ జ్యోతి’ పై పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి శ్రీ రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


Source: https://www.facebook.com/TelanganaCMO

1 comment: